Saturday, December 21, 2024
Homeఅంతర్జాతీయంపొరపాటున బ్యాంక్ ఖాతాలో పడిన డబ్బు

పొరపాటున బ్యాంక్ ఖాతాలో పడిన డబ్బు

Date:

తన బ్యాంక్ ఖాతాలో పొరపాటున పడిన డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమైనందుకు సింగపూర్‌లో ఓ భారత జాతీయుడికి జైలు శిక్ష పడింది. ఆ నగదు అతనిది కాదని తెలిసినప్పటికీ.. బ్యాంకుకు దాన్ని తిరిగి ఇవ్వనందుకు అక్కడి న్యాయస్థానం 9 వారాల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్ (47) సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. ఆయన బ్యాంకు ఖాతాలోకి పొరపాటున వేరే ఖాతా నుంచి 25000 డాలర్లు (సుమారు రూ.16లక్షలు) బదిలీ అయ్యాయి. అయితే, అవి తనవి కాదని మథియాళగన్‌కు తెలుసు. అయినప్పటికీ.. ఆ డబ్బులతో తన అప్పులు తీర్చడంతోపాటు కొంత మొత్తాన్ని భారత్‌లోని కుటుంబానికి పంపాడు. కొన్ని నెలల క్రిందట జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి అతడు గతంలో పనిచేసిన సంస్థ నుంచి బ్యాంకుకు ఫిర్యాదు వచ్చింది.

సదరు సంస్థ విజ్ఞప్తి మేరకు మథియాళగన్‌కు బ్యాంకు అధికారులు లేఖ రాశారు. అవి పొరపాటున ఖాతాకు బదిలీ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరారు. సంస్థ డైరెక్టర్ కూడా వ్యక్తిగతంగా అతడికి విజ్ఞప్తి చేశాడు. ఆ నగదు తన దగ్గర లేదని, అప్పులను తీర్చుకున్నానని జవాబు ఇచ్చాడు. అనంతరం అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నవంబర్‌ 2023లో పోలీసులు అతడిని విచారించారు. అయితే, నెలకు కొంత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. అలా చేయడంలో విఫలమయ్యాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం..అతడికి 9 వారాల జైలు శిక్ష విధించింది.