Tuesday, December 24, 2024
Homeఅంతర్జాతీయంనెపోలియన్‌ వాడిన తుపాకులు వేలం

నెపోలియన్‌ వాడిన తుపాకులు వేలం

Date:

ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టే వాడిన రెండు పిస్తోళ్లు వేలం వేశారు. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్‌ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్‌ యూరోలకు అవి అమ్ముడుపోయాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లు పైమాటే. బ్లూఫౌంటేన్‌ ప్యాలెస్‌ పక్కనే ఉన్న ఓసెనాట్‌ ఆక్షన్‌ హౌస్‌లో ఆదివారం వీటి వేలం జరిగింది. అదే ప్యాలెస్‌లో 1814 ఏప్రిల్‌ 12వ తేదీన నెపోలియన్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నెపోలియన్‌ వాడిన తుపాకులను లూయిస్‌ మెరైన్‌ గోస్సెట్‌ అనే కంపెనీ తయారుచేసింది. ఆ కంపెనీ ఆశించిన మొత్తం కంటే ఎక్కువే ఈ వేలంలో లభించింది.

ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ తుపాకులను జాతీయసంపదగా ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాతే ఈ వేలం వేయడం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం ఈ వస్తువులను ఎగుమతి చేయడంపై నిషేధం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఇవి ఎవరివద్ద ఉంటే వారి నుంచి 30 నెలల్లోపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ తుపాకుల తయారీలో బంగారం, వెండి వినియోగించారు. అవి నెపోలియన్‌ సైనికాధికారి కుటుంబానికి వారసత్వంగా లభించాయి. ఈ వేలంలో తుపాకులు, వాటి బాక్స్‌, పౌడర్‌ హార్న్‌ ఇతర యాక్సెసరీస్‌లు కూడా వేలంలో పెట్టారు. గతంలో నెపోలియన్‌కు చెందిన ట్రైకార్న్‌ హ్యాట్‌ను వేలం వేయగా 1.9 మిలియన్‌ డాలర్లు లభించాయి. 1815లో ప్రవాసం నుంచి అధికారం చేపట్టిన నెపోలియన్‌ బ్యాటిల్‌ ఆఫ్‌ వాటర్‌లూలో ఓటమి పాలయ్యారు. 1821లో ఆయన మరణించారు.