పాక్ ప్రభుత్వానికి అర్షద్ నదీమ్ తన గ్రామం కోసం ఓ విజ్ఞప్తి చేశాడు. గ్రామస్థుల సహకారంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన నదీమ్ వారికోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. ”మా గ్రామంలో రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సరఫరా కూడా సరిగా లేదు. ఆ సదుపాయం కల్పిస్తే నాతోపాటు మా గ్రామానికి చాలా ఉపయోగం. మియాన్ చాన్నులో ఓ యూనివర్సిటీ రావాలనేది నా కల. మా సోదరీమణులు వేరే సిటీకి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ముల్తాన్‌కు వెళ్లాలంటే కనీసం రెండు గంటలపాటు ప్రయాణించాలి. అదే ఒక యూనివర్సిటీ మాకు దగ్గరగా ఉంటే చాలామంది గ్రామీణులకు ఉపయోగకరం. క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. గ్రామంలోని ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక వారందరి పాత్ర ఉంది. ఈవెంట్ల కోసం వెళ్లేందుకు సహకారం అందించారు. తప్పకుండా గ్రామస్థుల రుణం తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తా” అని నదీమ్ వ్యాఖ్యానించాడు. పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. ఈ ఒలింపిక్స్‌లో పాక్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. అదీ కూడా నదీమ్ సాధించిన గోల్డ్ మెడలే.