పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
యువతరం పెడదొవ పట్టకుండా, వినాశకరమైన ప్రభావాల నుంచి రక్షించేందుకు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని కోరారు. భాష, మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించడం, సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారని తీర్మాణంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీకి, దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ ఉపయోగించడంపై ఆందోళనలు ఉన్నాయని టాంగీ పేర్కొన్నాడు.
ఈ తీర్మానం వెనక టార్గెట్ ఇమ్రాన్ ఖాన్ అని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన యువతరాన్ని ప్రేరించారు. ఏ వ్యక్తి, పార్టీ గురించి స్పష్టంగా ప్రస్తావించకున్నా, యువతను ఇమ్రాన్ ఖాన్ పార్టీ ”పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)” దూరం చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ వ్యాప్తంగా యువతలో అక్కడి సైన్యంపై గౌరవం అనేది తగ్గుతోంది. దీనికి కూడా సోషల్ మీడియా ప్రభావం కారణమని సంప్రదాయ పాక్ రాజకీయ నాయకులు భావిస్తున్నారు.