ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలోని ప్రజలను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెడుతోంది. గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్ర దారుణంగా తయారవుతున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో గాజా వాసులు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. ఈ మేరకు గాజాలో ఐక్యరాజ్యసమితి తరపున మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గాజాలోని పిల్లలను పోషకాహార లోపం వెంటాడుతోందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కౌ వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసర సహాయం కింద పంపిన 10 ట్రక్కుల్లో కొన్నింటిపై స్థానికులు దాడులు చేసి ఆహార సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇది చూస్తే అక్కడి పరిస్థితి అర్థం అవుతోందని చెప్పారు. ఇక మరికొన్ని ట్రక్కులు తనిఖీల కారణంగా ఆగిపోవడంతో మరో రెండు రోజులు ఆలస్యంగా అక్కడికి చేరుకుంటాయని తెలిపారు. గాజా వాసుల ఆకలి బాధ తమ సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురి చేసిందని కార్ల్ స్కౌ వెల్లడించారు. ప్రజావ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం కావడంతో ఆహార పంపిణీ సవాలుగా మారిందని తెలిపారు.
హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. తమ వారిని విడుదల చేయాలని కోరుతూ బందీల కుటుంబసభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ నుంచి జెరూసలేం వరకు 4 రోజుల పాదయాత్రను నిర్వహించారు. ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఖతార్ వేదికగా చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలో మిగిలినవారు విడుదల అయ్యేందుకు ఇరువర్గాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా తెలిపింది.