తాబేళ్లను చాలా దేవుడి రూపంగా ఆరాధిస్తారు. కొంత మంది తాబేళ్లను ఆహారంగా తీసుకుంటుంటారు. అయితే ఇటీవల తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని జాంజిబార్‌లో చోటుచేసుకుంది. మరో 78 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సాధారణంగా సముద్ర తాబేళ్లను తింటుంటారు. ఇక్కడ లభించే సముద్ర తాబేళ్ల మాంసానికి మాంచి డిమాండ్ కూడా ఉంటుంది. చుట్టుపక్కల దేశాల వాళ్లు కూడా తాబేలు మాంసం కోసం టాంజానియా వెళ్తుంటారు. పలు రకాల ఫ్లేవర్లలో టేస్టీటేస్టీ తాబేలు మాంసాన్ని ఇక్కడ అమ్ముతుంటారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మరణించారు. మరో 78 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా తూర్పు ఆఫ్రికా ఉలిక్కిపడింది. అస్వస్థతకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు కారణం ఏమై ఉంటుందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుంటే తాబేలులో కిలోనిటాక్సియం అనే పదార్థం ఉంటుందని, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.