అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై ఒక యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది.
ఈ ఘటనపై ఎఫ్ఐబీ పిట్స్బర్గ్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్.. మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుబెట్టడానికే ఈ కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. ఈ ఉదంతాన్ని ట్రంప్ హత్యకు కుట్రగా అభివర్ణించారు. దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు సాగిస్తోన్నట్లు వివరించారు. డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఆగంతకుడిని థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు ఎఫ్‌బీఐ అధికారులు. అతని వయస్సు 20 సంవత్సరాలే. పెన్సిల్వేనియా బేథెల్ పార్క్‌లో నివాసం ఉంటోన్నట్లు నిర్ధారించారు.
ట్రంప్ ప్రసంగిస్తోన్న వేదిక నుంచి సుమారు 130 గజాల దూరంలో ఉన్న ఓ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రూఫ్ టాప్‌పై నుంచి కాల్పులు జరిపాడు. ఒక్కసారి కాదు పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్.. ట్రంప్‌ను గాయపరిచింది ఆయన కుడి చెవిని రాసుకుంటూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
ఆ వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ కౌంటర్- స్నైపర్ టీమ్ ఎదురు కాల్పలు జరిపింది. స్నైపర్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ అక్కడికక్కడే మరణించాడు. బుల్లెట్లు అతని తలను ఛిద్రం చేశాయి. ఈ కాల్పులు, ఎదురు కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.