Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంజాంబియాను కుదిపేస్తున్న కలరా వ్యాధి

జాంబియాను కుదిపేస్తున్న కలరా వ్యాధి

Date:

ఆఫ్రికన్ దేశం జాంబియా దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని విధంగా ఆ దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది. ఈ అతిసార వ్యాధి మూలాన వేలల్లో రోగులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి భారత్‌ ఆపన్న హస్తం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలను సాయంగా పంపింది. మొత్తంగా ఆ దేశానికి 3.5 టన్నుల మానవతా సాయం పంపినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చిన్న దేశంలో కలరా మహమ్మారి కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దేశంలోని మొత్తం పది ప్రావిన్సులకు గానూ తొమ్మిది ప్రావిన్సులకు ఈ కలరా వ్యాపించింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొన్న ఈ కలరా వ్యాప్తిని అరికట్టడానికి జాంబియా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. స్టేడియాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తోంది. సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా చేపట్టారు.