Saturday, December 28, 2024
Homeఅంతర్జాతీయంగుండెపోటుతో ల‌ష్క‌రే తోయిబా డిప్యూటీ చీఫ్ క‌న్నుమూత‌

గుండెపోటుతో ల‌ష్క‌రే తోయిబా డిప్యూటీ చీఫ్ క‌న్నుమూత‌

Date:

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ హఫీజ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కి మరణించారు. అతడు ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ బావమరిది. అతడు గత కొంత కాలంగా మధుమేహంతో బాధపడుతున్నాడు. శుక్ర‌వారం ఉదయం గుండెపోటుతో లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 26/11 ముంబై ఉగ్ర దాడులకు మక్కి ఆర్థిక సాయం అందించారు.

మే 2019లో మక్కిని పాకిస్థాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. లాహోర్‌లో గృహనిర్భంధంలో ఉంచింది. 2020లో టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ మేరకు జీవిత ఖైదు విధించింది. ఇక గతేడాది (2023) జనవరిలో యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కూడా మక్కిని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ముంబై ఉగ్రదాడితోపాటు మక్కికి ఎర్రకోట దాడిలో ప్రమేయం ఉంది. దీంతో అతడిని భద్రతా సంస్థలు భారతదేశంలో వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాయి. 2000 సంవత్సరం డిసెంబర్‌ 22న ఢిల్లీ ఎర్రకోటపై లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.