హిందీలో రేడియో ప్రసారాలు కువైట్‌లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్‌లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపింది. హిందీలో కార్యక్రమాలను ప్రసారం చేయడంపై కువైట్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది.
కువైట్ రేడియోలో హిందీ ప్రసారాలు ప్రారంభంకావడం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగు పరుచుకోవడంలో కీలకంగా మారనున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. చాలా సంవత్సరాలుగా భారత్, కువైట్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. దాదాపు 10లక్షల మంది భారతీయులు కువైట్‌లో నివసిస్తున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, శాస్త్రవేత్తలు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, టెక్నీషియన్లు, నర్స్, రిటైలర్లు, వ్యాపారవేత్తలు సైతం ఇక్కడ నివాసం ఉంటున్నారు.