Tuesday, October 22, 2024
Homeఅంతర్జాతీయంకిమ్‌ భూభాగంలో ద‌క్షిణ‌కొరియా డ్రోన్‌

కిమ్‌ భూభాగంలో ద‌క్షిణ‌కొరియా డ్రోన్‌

Date:

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం నానాటికీ తీవ్రతరమవుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ డ్రోన్‌ తమ భూభాగంలో కనిపించిదని కిమ్‌ సర్కారు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. రాజధాని పాంగ్యాంగ్‌లో జరిపిన సాధారణ సోదాల్లో దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్‌ను కనుగొన్నట్లు కిమ్ సర్కారు పేర్కొంది. ఈ నెలలో మూడుసార్లు దక్షిణ‌ కొరియా ఇలాంటి డ్రోన్‌లతో ప్రచార కరపత్రాలను వదిలినట్లు ఆరోపించింది. అదేవిధంగా తమ భూభాగంలో కనిపించిన డ్రోన్‌ గత నెల దక్షిణ కొరియా సైనిక కవాతులో కనిపించిన రకమేనని ఉ.కొరియా మిలిటరీ, స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్ధారించాయి. మరోవైపు డ్రోన్‌లను ఉపయోగించి తమ భూభాగంలో కరపత్రాలు వదలడాన్ని ఉత్తర కొరియా మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. మరోసారి తమ గగనతలంలో శత్రు దేశం డ్రోన్‌లు ఎగిరినా, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లఘించినా యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని హెచ్చరించింది. ప్రతీకార దాడులు సైతం తీవ్రతరంగా ఉంటాయని వ్యాఖ్యానించింది.

మే చివరి వారం నుంచి దక్షిణ కొరియా గగనతలంపైకి కిమ్ ప్రభుత్వం వేల సంఖ్యలో చెత్త బెలూన్లు పంపించింది. అనంతరం దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇరుదేశాలను కలిపే రోడ్లు, రైల్వే మార్గాలను ఇటీవల బాంబులతో పేల్చివేసింది. మరోవైపు దక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ కిమ్ సర్కారు తమ రాజ్యాంగంలో సవరణలు చేసింది.