సింగపూర్‌లో ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు వెయ్యాలి. ఓటు వెయ్యకపోతే చర్యలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వ ఎంపిక బాధ్యతలో తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. ఓటర్ల సౌకర్యార్థం పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చాయి. పోలింగ్ శాతాన్ని వీలైనంత పెంచేందుకు వీలుగా సరళీకరించాయి. ఫలితంగా 2023 అధ్యక్ష ఎన్నికల్లో 93.55శాతం పోలింగ్ నమోదైంది.
సింగపుర్ ఓటింగ్ ప్రక్రియ
సింగపూర్‌లో 21 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క పౌరుడు ఓటు వేయడానికి అర్హులు. ఇక్కడ ప్రజలకు క్యూలతో ఇబ్బందిలేకుండా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. 2023 అధ్యక్ష ఎన్నికల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కూడా ఓటు వేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా దాదాపు 30 వైద్యశాలల వద్ద పోలింగ్ స్టేషన్లను ఉంచారు. ఈ దేశంలో పోలింగ్ బూత్‌ల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మన బూత్ ఉన్న ప్రాంతం పిన్‌కోడ్‌ను వినియోగించి.. అక్కడ క్యూ ఎంత దూరం వరకు ఉందో తెలుసుకోవచ్చు. సాధారణంగా బ్యాలెట్ పేపర్‌పై గతంలో పెన్ను వాడొచ్చు. ఇప్పుడు అది మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఒక ఎక్స్ మార్కు స్టాంప్‌ను తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్లను తన గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక డ్రాప్-ఆఫ్ వాహనాలను ఏర్పాటుచేస్తారు. పోలింగ్స్టేషన్లలో వీల్‌ఛైర్ సేవలు ఉంటాయి. ముసలి వారి బదులు వారి కేర్ రివర్స్ లైన్లలో నిలబడవచ్చు. బ్యాలెట్ పత్రంపై గుర్తులను సరిగ్గా గుర్తించలేని వారికి సాయం చేసేందుకు సిబ్బంది ఉంటారు. వారే ముసలివారు కోరినచోట మార్క్ వేసేందుకు సాయం చేస్తారు. ఈ ఉద్యోగులు ముందే తాము ఓటర్ల గోప్యతను కాపాడతామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. 2023లో సింగపుర్ దాదాపు 10 ఓవర్సీస్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసింది. బీజింగ్, కాన్బెర్రా, దుబాయ్, హాంకాంగ్, లండన్, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, షాంఘై, టోక్యో, వాషింగ్టన్ దీనిలో ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఓటింగ్ జరుగుతుంది.
పోలింగ్‌లో పాల్గొనకపోతే చర్యలు..
సింగపూర్‌లో ఓటు వేయకపోతే చర్యలు కూడా చాలా వేగంగా, కఠినంగా ఉంటాయి. ఎవరైనా అర్హులైన ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకపోతే వారి జాబితాను రిటర్నింగ్ ఆఫీసర్లు తయారుచేస్తారు. దానిని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపుతారు. సదరు ఓటర్ల పేర్లను వారి డివిజన్ల జాబితాలో తొలగిస్తారు. ఫలితంగా ఆ ఓటరు మరే ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌లో పాల్గోనలేడు. అంతేకాదు.. దేశ అధ్యక్ష, పార్లమెంటరీ పోటీలో నిలబడలేడు. ఎవరైనా ఓటు హక్కును పునరుద్ధరించుకోవాలంటే సింగాపాస్ను వాడి లేదా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రార్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓటు వేయలేకపోవడానికి సహేతుక కారణం వెల్లడించాయి. సహేతుక కారణం లేకపోతే మాత్రం 50 డాలర్ల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.