Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంఎన్ని మార్పులు తెచ్చినా చైనాలో పెళ్లిళ్లు జ‌ర‌గ‌ట్లేదు

ఎన్ని మార్పులు తెచ్చినా చైనాలో పెళ్లిళ్లు జ‌ర‌గ‌ట్లేదు

Date:

చైనాలో రోజురోజుకు పెళ్లిళ్ల సంఖ్య త‌గ్గిపోతుంది. వివాహ వ్యవస్థను బలోపేతం చేయడానికి అక్క‌డి ప్ర‌భుత్వం నడుం బిగించింది. తాజాగా పెళ్లిళ్లకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తెస్తూ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటి వరకు ఉన్న ప్రాంతీయ నిబంధనలను తొలగించింది. హౌస్‌హోల్డ్‌ రిజిస్టర్‌ అవసరం లేదని పేర్కొంది. కుటుంబ వ్యవస్థకు అనుకూల సమాజం నిర్మించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది.

విడాకులను తగ్గించేందుకు వీలుగా వీటిల్లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. విడాకులకు 30 రోజుల కూలింగ్‌ పీరియడ్‌ను కూడా ఇవ్వాలని పేర్కొంది. జంటలో ఏ ఒక్కరైనా విడాకులకు ఇష్టపడకపోతే.. వారు దరఖాస్తును వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తారు. ఈ డ్రాఫ్ట్‌పై సెప్టెంబర్‌లోగా ప్రజలు అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో చైనాలో 34.3 లక్షల మంది పెళ్లిళ్లు చేసుకొన్నారు. గతేడాదితో పోలిస్తే 4,98,000 తక్కువ. 2013 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పెళ్లిళ్లు జరగడం ఇదే తొలిసారి.

గతేడాది కూడా చైనాలో వివాహాల రేటును పెంచేందుకు ఓ ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీని కింద సరైన సమయంలో యువతీయువకులకు పెళ్లి అయ్యేట్లు చూడటం, పిల్లల బాధ్యతలను భార్యభర్తలు పంచుకొనేలా చేయడం, పెళ్లికూతుళ్లకు చెల్లించే అధిక కట్నాలు అడ్డుకోవడం, ఇతర ఆచారాలను పరిరక్షించడం వంటివి చేపట్టారు. మరోవైపు చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటును పెంచేందుకు ఆయా ప్రభుత్వాలు పన్ను రాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలను కల్పించారు. ఇక 25 అంతకంటే తక్కువ వయస్సు ఉన్న యువతులు వివాహం చేసుకొనేలా రాయితీలను కూడా ప్రకటించింది.