Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంఉగ్ర జాబితా నుంచి తాలిబ‌న్ల‌కు ఊర‌ట‌

ఉగ్ర జాబితా నుంచి తాలిబ‌న్ల‌కు ఊర‌ట‌

Date:

తాలిబ‌న్లు అప్ఘానిస్తాన్‌లో ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్న ఇప్ప‌టికి ఇంకా ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్‌ను తొలగించాలని రష్యా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యున్నత స్థాయిలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

అఫ్గానిస్థాన్‌ నుంచి ఆగస్టు 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.. అక్కడి పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ ప్రపంచంలో ఏ దేశం కూడా వారి పాలనను అధికారికంగా గుర్తించలేదు. కేవలం చైనా, యూఏఈలు మాత్రమే తాలిబన్‌ల రాయబారులను అంగీకరించాయి. అయితే, 2003లో ‘తాలిబన్‌’ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన రష్యా.. వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే అంశంపై ఈ ఏడాది జులైలో మాట్లాడిన పుతిన్‌.. తాలిబన్‌ ఉద్యమాన్ని ఉగ్రవాదంపై పోరులో భాగంగానే చూస్తామని చెప్పారు. తాజా పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ మాట్లాడుతూ.. అఫ్గాన్‌ ప్రభుత్వంతో తాము ఆచరణాత్మక సంప్రదింపులు జరిపే అవసరముందన్నారు. ఆ దేశంతో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. తాజా నిర్ణయం వాస్తవరూపం దాల్చడానికి చట్టపరమైన పలు నిబంధనలు పాటించాల్సి ఉందని అఫ్గాన్ వ్యవహారాలు చూసే రష్యా ప్రతినిధి పేర్కొన్నారు.