గత రెండేళ్లుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనిక, ఆర్థిక నష్టాలను తీవ్ర స్థాయిలో చవిచూసింది. ఈ క్రమంలో కోల్పోయిన సైనిక శక్తిని భర్తీ చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సైనిక నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని అక్కడి పార్లమెంటు గత ఏడాదే ఆమోదించినప్పటికీ.. తాజాగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయడంతో అమల్లోకి వచ్చింది.
ఉక్రెయిన్ 5 లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ స్థాయిలో సమీకరణ చేయడం.. 13.4 బిలియన్ డాలర్ల విలువతో సమానమన్నారు. ఇన్నాళ్లుగా యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న సైనికులను మార్చడం, లేదా ఇంటికి పంపించడం వంటి సున్నిత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సైనికాధికారులకు సూచించారు. ఈ సైనిక సమీకరణ అంశంపై గతేడాది అక్కడి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే, దీనికి ఆమోదం తెలిపేందుకు జెలెన్‌స్కీ ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా తాజా నిర్ణయం ద్వారా కొత్తగా ఎంతమంది ఉక్రెయిన్ సైన్యంలోకి వస్తారనే విషయంపై సైనికాధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు.