ఇప్పుడు ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య వైరం నెలకొంది. ఆ రెండు దేశాలే ఇరాన్-ఇజ్రాయెల్. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి దాదాపు 45ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు. దీంతో దశాబ్దాల నుంచే రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కానీ, ఆ దాడుల్లో తమ ప్రమేయం లేదని రెండు దేశాలు ఖండించడంతో ఈ సంఘర్షణను ‘షాడో వార్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటున్నది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో..
గత సంవత్సరం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. ఆ వెంటనే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగడంతో ఇప్పటి వరకు 33 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందినట్టు ఐక్యరాజ్య సమితి అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది.