ఒకరినొకరు నచ్చకుంటే విడాకులు తీసుకొవడం మామూలే. కాని దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే, ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది.
”ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్ యూ’. టేక్ కేర్.. మీ మాజీ భార్య” అని షైకా మహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు.. షైకా మహ్రా అకౌంట్ హ్యాక్ అయ్యిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. పలువురు నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కుమార్తె షేక్ మెహ్రా. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో మే 27, 2023న వీరి వివాహం జరిగింది.
ఏడాది తర్వాత.. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త, చిన్నారితో కూడిన ఫొటోలను మహ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ‘మనమిద్దరం మాత్రమే’ అంటూ చిన్నారితో కూడిన మరో ఫొటోతో పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే విడాకుల గురించి యువరాణి బహిరంగంగా ప్రకటించారు.