మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌సూకీ ఇంటిని వేలం వేసేందుకు చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. 142 మిలియన్ల డాలర్ల ధరతో ఆ నివాసాన్ని వేలంలో ఉంచగా.. కొనేందుకు ఎవరూ ముందుకురాలేదు. మయన్మార్‌లో అతిపెద్ద నగరమైన యంగూన్‌లో సరస్సు ఒడ్డున 1.9 ఎకరాల విస్తీర్ణంలో సూకీ ఇల్లు ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆంగ్‌సూకీ తండ్రి జనరల్ ఆంగ్ సాన్ 1947లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమె తల్లికి ఈ రెండు అంతస్తుల భవనాన్ని కేటాయించింది. అందులోనే సూకీ 2010 వరకు 15 ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2012లో ఆ నివాసాన్ని విడిచి రాజధాని నగరం నేపితాకు వెళ్లారు. 2015 ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో జాతీయస్థాయిలో కీలక నేతగా మారారు.
ఆంగ్‌సాన్‌సూకీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2021లో ఆర్మీ కూల్చివేయడంతో పాటు ఆమెను మరోసారి నిర్బంధించింది. తర్వాత పలు కేసుల్లో ఆమెకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక ఈ ఇంటి విషయంలో సూకీ, ఆమె సోదరుడికి మధ్య వివాదం ఉంది. ఆ ఇంటిని వేలం వేస్తే వచ్చే సొమ్మును వారిద్దరికి పంచాల్సి ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలకు ఈ ఇల్లు అనధికారిక కార్యాలయంగా పనిచేసింది. ఆ ఇంట్లో ఆంగ్ సాన్ సూకీతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిలరీ క్లింటన్, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ తదితరులు భేటీ అయ్యారు. అక్కడ గృహ నిర్బంధంలో ఉన్న సమయంలోనే 1991లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. ఇదిలా ఉంటే.. మరోసారి ఆ ఇంటి వేలం ప్రక్రియ జరగనుంది. వేలం ఉత్తర్వులను సూకీ తరఫు న్యాయవాదులు సవాలు చేశారు.