అగ్రరాజ్యం అమెరికాలో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. కొన్ని పట్టణాల్లో మంచు తుపాన్ కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో కేవలం ఆన్‌లైన్ క్లాస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్‌ను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఒక స్నోమొబైలర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ రాష్ట్రంలో 1,50,000 కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు భారీగా పడటం మొదలైంది. దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కనెక్టికట్‌లోని ఫర్మింగ్టన్ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మేర మంచు కురిసింది. ఈశాన్య అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడాన్ని నిషేధించారు. న్యూయార్క్, బోస్టన్‌లలో దాదాపు 1,200 విమానాలు రద్దయ్యాయి. మరో 2,700 విమాన సర్వీసుల్లో జాప్యం ఏర్పడింది. న్యూయార్క్ నగరంలో 744 రోజుల తర్వాత మంచుపడింది. ఇక్కడ 2.5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది.