అగ్రరాజ్యం అమెరికాపై మంచు తుఫాన్ విరుచుకు పడింది. వింటర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపనున్నది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కాన్సాస్ సిటీపై పెను ప్రభావం పడింది. మిస్సోరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. మంచు తుఫాన్‌కు బ్లెయిర్‌గా నామకరణం చేశారు. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ తుఫాన్ ప్రభావం ఉన్నది. బ్లెయిర్ మంచు తుఫాన్ వల్ల.. అధిక స్థాయిలో మంచు, ఐస్, సబ్ జీరో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
పోలార్ వొర్టెక్స్ వల్ల విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలి.. సెంట్రల్ అమెరికాను ప్రస్తుతం వణికిస్తున్నది. ఇప్పటికే వేల సంఖ్యలో విమానాలు ఆలస్యం అవుతున్నాయి. కొన్నింటిని రద్దు కూడా చేశారు. తుఫాన్ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామయ్యాయి. స్కూళ్లను మూసివేశారు. సోమవారం తర్వాత పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ శాఖ తెలిపింది. కాన్సాస్ సిటీలో 32 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్థాయిలో మంచు కురిసింది. రానున్న కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోనున్నాయి. మైనస్ 10 నుంచి 15 డిగ్రీలకు పడిపోయే ఛాన్సు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాన్సాస్‌కు ప్రత్యేకంగా అలర్ట్ జారీ చేశారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు అన్నారు.