యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామి నారాయణ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోడీ విశిష్ట అతిథిగా ఈ అతి పెద్ద హిందూ దేవాలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి రంగం సిద్దమైంది. ప్రధాని ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు.
బోచసన్వాసి అక్షర్‌పురుషోత్తం స్వామినారాయణ్ పేరిట అబుదాబిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు.
దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. దుబాయి-అబుదాబి మార్గంలో 55వేల చదరపు మీటర్ల పరిధిలో దీన్ని నిర్మించారు. యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆధ్వర్యంలో 42 దేశాలకు చెందిన రాయబారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి అద్భుత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్నది వాస్తవరూపం దాల్చిందన్నారు. బాప్స్ హిందూ ఆలయ ప్రాజెక్టు చీఫ్ స్వామి బ్రహ్మవిహారి దాస్ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణం, ఇతర అంశాలను వివరించారు.