Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంఅణువిద్యుత్‌లో దూసుకుపోతున్న చైనా

అణువిద్యుత్‌లో దూసుకుపోతున్న చైనా

Date:

చైనా అణువిద్యుత్‌ అభివృద్ధిలో అత్యంత వేగంతో దూసుకుపోతోందని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. చైనా వేగానికి అమెరికా కనీసం 15 ఏళ్లు వెనకబడిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 27 అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొంది. ఒక్కో దానిని పూర్తి చేయడానికి బీజింగ్‌కు సగటున ఏడేళ్ల సమయం పడుతోందని తెలిపింది. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో సృజనాత్మక శక్తి పెరుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

చైనాలోని ప్రభుత్వరంగ ఫైనాన్సింగ్‌ సంస్థలు కూడా అణువిద్యుత్తు రంగానికి కేవలం 1.4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమదేశాలు ఇచ్చే అప్పులతో పోలిస్తే ఇవి చాలా చౌక. దీనికితోడు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా వీటికి అండగా నిలుస్తున్నాయి. దీంతో స్థానికంగా అణువిద్యుత్తు రంగంలో ఇప్పుడు డ్రాగన్‌ ప్రబల శక్తిగా ఎదిగింది. ఇప్పటికే బీజింగ్‌ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు కార్ల విషయంలో అగ్రగామిగా నిలిచినట్లే. అణు విద్యుత్తులో కూడా వేగంగా దూసుకెళుతోంది. షిడో బేలో నిర్మించిన నాలుగోతరానికి చెందిన హైటెంపరేచర్‌ గ్యాస్‌ కూల్డ్‌ రియాక్టర్‌ గతేడాది ఆన్‌లైన్‌లోకి వచ్చింది. దీనిపై ది చైనా నూక్లియర్‌ ఎనర్జీ అసోసియేషన్‌ స్పందిస్తూ.. వీటిల్లో వినియోగించే 2,200 పరికరాలను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.