Wednesday, November 6, 2024
Homeఅంతర్జాతీయంఅగ్ర‌రాజ్యానికి ఉపాధ్య‌క్షుడుగా ఆంధ్రా అల్లుడు

అగ్ర‌రాజ్యానికి ఉపాధ్య‌క్షుడుగా ఆంధ్రా అల్లుడు

Date:

అగ్ర‌రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఉపాధ్య‌క్షుడిగా జేడీ వాన్స్‌ వ్యవహరించనున్నారు. అంటే ఆంధ్రా అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడు కానున్నరన్నమాట. ఆయన భార్య ఉష తెలుగమ్మాయి కావడం ఇందుకు నేపథ్యం. ఆమె అమెరికాకు సెకండ్‌ లేడీగా వ్యవహరించబోతున్నారన్నమాట. ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్‌ ఎంపిక చేసుకున్నప్పటి నుంచే ఉష పేరు మార్మోగింది. ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం వేళ ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్‌ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే, శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్‌ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ… క్రిష్‌ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్‌ ఇంజినీర్‌. యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌ ఏరోడైనమిక్స్‌ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. ఆపై కాలిన్స్‌ ఏరోస్పేస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.