అందాల పోటీలధ అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్ యూనివర్స్ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా ‘మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్’ టైటిల్ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా.. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు.
ఈ ఏడాది మే నెలలో జరగబోయే ‘మిస్ యూనివర్స్ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్ ఎయిర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే ‘విశ్వసుందరి 2024’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు. ఈ అందాల రాణి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ ‘మిస్ యూనివర్స్’ ఆర్గనైజేషన్ గతేడాది నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అందాల పోటీలో 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్ ఆ దేశ అందాల కిరీటం గెల్చుకున్నారు. ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.