Tuesday, October 8, 2024
Homeఅంతర్జాతీయంఅంత‌రిక్షంలోనే ఉన్న సునీతా విలియ‌మ్స్‌

అంత‌రిక్షంలోనే ఉన్న సునీతా విలియ‌మ్స్‌

Date:

వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ ఇంకా అంత‌రిక్షంలోనే ఉన్నారు. ఆవిడ రాక మ‌రింత ఆల‌స్యం కానుంది. ఇప్ప‌టికే ఆమె తిరుగుప్ర‌యాణం నెల రోజుల ఆల‌స్య‌మైంది. తిరిగి భూమికి వ‌చ్చే బోయింగ్ వ్యోమ‌నౌక‌లో స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో .. ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ .. స్పేస్ స్టేష‌న్‌లోనే చిక్కుకున్నారు. అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లి జూన్ మ‌ధ్య‌లోనే తిరిగి రావాల్సిన ఇద్ద‌రు వ్యోమ‌గాలు.. బోయింగ్ వ్యోమ‌నౌక‌లో థ్ర‌స్ట‌ర్ ఫెయిల్యూర్‌తో అక్క‌డే ఉండిపోయారు. బోయింగ్ స్టార్‌లైన‌ర్ క్యాప్సూల్‌లో.. హీలియం వాయువు లీక‌వుతున్న‌ట్లు కూడా గుర్తించారు. దీంతో ఆ ఇద్ద‌రు వ్యోమ‌గాముల‌ను నాసా అక్క‌డే ఉంచేసింది.

వ్యోమ‌గాములు ఎప్పుడు తిరిగి వ‌స్తారో తెలియ‌ద‌ని, ఇంకా ఆ తేదీని నిర్ణ‌యించ‌లేద‌ని నాసా క‌మ‌ర్షియ‌ల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజ‌ర్ స్టీవ్ స్టిచ్ తెలిపారు. స్టార్‌లైన‌ర్‌లోనే విల్మోర్‌, విలియ‌మ్స్‌ను తీసుకురావ‌డం త‌మ ల‌క్ష్యం అని పేర్కొన్నారు. స్టార్‌లైన‌ర్ వ్యోమ‌నౌక‌లో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మైన నేప‌థ్యంలో.. బ్యాక‌ప్ ఆప్ష‌న్ల‌ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు స్టిచ్ వెల్ల‌డించారు. స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగ‌న్ క్యాప్సూల్ ద్వారా కూడా వ్యోమ‌గాముల‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. నాసా వ‌ద్ద ఎప్పుడూ ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు ఉంటాయ‌న్నారు. స్టార్‌లైన‌ర్‌లో ఉన్న అయిదు థ్ర‌స్ట‌ర్లు విఫ‌లం అయ్యాయ‌ని, జూన్ ఆర‌వ తేదీన స్పేస్‌స్టేష‌న్‌తో డాకింగ్ స‌మ‌యంలో ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు ఇంజినీర్లు చెప్పారు. దీంట్లో నాలుగు థ్ర‌స్ట‌ర్ల‌ను రీయాక్టివేట్ చేసిన‌ట్లు నాసా పేర్కొన్న‌ది. స్టార్‌లైన‌ర్‌లోని థ్ర‌స్ట‌ర్ల‌ను ఈ వారం చివ‌ర‌లో ప‌రీక్షిస్తామ‌ని, మ‌రింత డేటా సేక‌రించి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోయింగ్ అధికారి మార్క్ నప్పి తెలిపారు.