Wednesday, January 15, 2025
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో మ‌హిళా జ‌ర్న‌లిస్టు అనుమానాస్ప‌ద మృతి

బంగ్లాదేశ్‌లో మ‌హిళా జ‌ర్న‌లిస్టు అనుమానాస్ప‌ద మృతి

Date:

బంగ్లాదేశ్‌లోని గాజీ(బెంగాలీ) టీవీ ఛానల్‌కు చెందిన జర్నలిస్టు రహ్మునా సారా మృతదేహం సరస్సులో లభ్యమైంది. మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుప‌త్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సారా ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆమె సరస్సులో దూకినట్లు సమాచారం అందిందని వెల్లడించారు.

తన మరణానికి ముందు మంగళవారం రాత్రి సారా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. అందులో ”నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎప్పటికీ చల్లగా చూస్తాడు. త్వరలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావని ఆశిస్తున్నాను. మనం మన జీవితం కోసం ఎన్నో పథకాలు వేసుకున్నాం. కానీ వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు” అంటూ రాసుకొచ్చారు. మరో పోస్ట్‌లో ”చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే మరణించడం ఉత్తమం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ స్పందించారు. ”ఆమె మృతి భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన మరో క్రూరమైన దాడి. ఇటీవల అరెస్టయిన దస్తగిర్ గాజీకి చెందిన సెక్యులర్ మీడియా హౌస్ ఛానల్‌లో సారా పని చేస్తుంది” అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.