తన స్వేచ్ఛను రక్షించేందుకు న్యాయ, చట్టపరమైన ప్రయత్నాలు సరిపోలేదని, అందుకే అమెరికా గూఢచర్య ఆరోపణలపై తన నేరాన్ని అంగీకరించానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే అన్నారు. ఐరోపా పార్లమెంటు చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. పలు కారణాలతో తాను జైలు నుంచి విడుదల కాలేదని, జర్నలిజం నేరాన్ని అంగీకరించినందునే తనకు స్వేచ్ఛ లభించిందన్నారు. ”నేను చివరకు అవాస్తవిక న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. జర్నలిజం, విశ్వసనీయ వర్గాల నుంచి సమాచార సేకరణ, వాటిని బహిర్గతం చేశానని అంగీకరించినందునే జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. జర్నలిజం నేరం కాదు. స్వేచ్ఛాయుత, సమాచార సమాజానికి మూలస్తంభం. ముఖ్య అంశం ఏంటంటే.. తమ విధులను నిర్వర్తిస్తున్నందుకు జర్నలిస్టులను విచారించవద్దు” అని ఐరోపా కౌన్సిల్‌లోని న్యాయ, మానవహక్కుల వ్యవహారాల కమిటీ ముందు జూలియన్ అసాంజే చెప్పారు. స్వేచ్ఛా దీపం ఆరిపోకుండా, సత్యాన్వేషణ కొనసాగేలా, కొందరి ప్రయోజనాల కోసం ఎందరో గొంతుకలను అణచివేయకుండా చూసేందుకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2006లో వికీలీక్స్‌ను స్థాపించిన ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే.. దాని ద్వారా అమెరికాకు సంబంధించిన అనేక సైనిక రహస్యాలను బయటపెట్టారు. ఇరాక్, అఫ్గాన్‌లో అమెరికా సైన్యం దారుణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి కీలక సమాచారాన్ని బయటపెట్టడం సంచలనం రేపింది. దీంతో అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజే కొన్నేళ్లు ఆశ్రయం పొందారు. ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం లండన్ జైల్లో ఉన్న ఆయన.. అమెరికాతో ఒప్పందంలో భాగంగా తన నేరాన్ని అంగీకరించడంతో ఏడాది జూన్‌లో విడుదలయ్యారు.