Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంకోవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ కలకలం..

కోవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ కలకలం..

Date:

ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త క‌రోనా వేరియంట్ ఎక్స్‌ఈసీ తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌ను మొదటిసారిగా 2024 జూన్‌లో జర్మనీలో గుర్తించగా.. పలు దేశాలకు వ్యాప్తి చెందింది. డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో ఈ వేరియంట్ వేగంగా వృద్ది చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 27 దేశాల నుంచి సేకరించిన 500 నమూనాలలో ఎక్స్‌ఈసీ ఉన్నట్లు కనుగొనబడింది. ఈ వేరియంట్ ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్స్‌ నుంచి పుట్టుకొచ్చిన వేరియంట్‌గా ఎక్స్‌ఈసీని పేర్కొంటున్నారు. గతంలో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌లు KS.1.1, KP.3.3ల నుంచి పుట్టుకొచ్చిన హైబ్రిడ్‌ రకంగా దీనిని చెబుతున్నారు. ఎక్స్‌ఈసీ వేరియంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఓమిక్రాన్ సబ్ వేరియంట్‌ల కలయిక నుంచి ఆవిర్భవించిన వేరియంట్ కావడంతో శాస్త్రవేత్తలు.. దాని వ్యాప్తి, ప్రమాద తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవటం చాలా అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్‌లు దీనిని ఎదుర్కొవడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. ఎక్స్‌ఈసీ వేరియంట్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని అభివృద్ది చేస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్/బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం నుంచి తగినంత రక్షణ లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎక్స్‌ఈసీ వేరియంట్ లక్షణాలు విషయానికి వస్తే.. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. మరోవైపు శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.