Saturday, December 21, 2024
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు వ‌ద్దు

ఇరాన్‌కు అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు వ‌ద్దు

Date:

ఇరాన్ భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సూచలను జారీ చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దని భారతీయులకు సూచించింది. ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సహాయ సహకారాల కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, భద్రతా పరిస్థితిలో తీవ్రతను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతీయ పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ ముఖ్య నగరమైన టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అక్కడున్న భారతీయులకు తగిన సూచనలు జారీ చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు నివారించాలని, బయటకు రావద్దని, సురక్షిత షెల్టర్లలో ఉండాలని పేర్కొంది.