Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కశ్మీర్‌పై చర్చ..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కశ్మీర్‌పై చర్చ..

Date:

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కశ్మీర్‌పై మాట్లాడిన ముజ్జామ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌, జఫార్‌ఖాన్‌లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని భారత విద్యార్థులు విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్‌ ఠాకూర్‌ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ‘ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని’ వారు ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ భారత్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. 1984లో లండన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్‌, హత్య వెనక జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉందని ఆరోపించారు.

ముజ్జామ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌ ”వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌” అనే సంస్థను స్థాపించారు. ఆయన తండ్రితో కలిసి సంయుక్తంగా ”మెర్సీ యూనివర్సల్” అనే సంస్థను స్థాపించాడు. కాగా ఈ రెండింటికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐతో పాటు యూకేకు చెందిన నిఘా సంస్థలు విచారణ జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.