Saturday, December 21, 2024
Homeఆరోగ్యంస్త్రీలలో పెరుగుతున్న కాలేయ వ్యాధులు

స్త్రీలలో పెరుగుతున్న కాలేయ వ్యాధులు

Date:

మనిషి ఎప్పుడు ఎలా ఉంటున్నాడో అర్థంకావడం లేదు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం నుంచి రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ప్రోటీన్‌ల ఉత్పత్తి, అవసరమైన విటమిన్లు- ఖనిజాల సరఫరా, విష పదార్థాలను తొలగించడం వంటి వరకు అనేక కీలక విధులను చేపడుతుంది. ఇటీవల కాలంలో కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు కొన్ని రకాల లివర్ డిసీజ్‌లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో స్త్రీలలో బయటపడుతున్న కాలేయ వ్యాధులు, వాటి హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.

*కాలేయం వాపుతో కొన్ని వ్యాధులు

సాధారణంగా లివర్ చిన్న సమస్యలను దానంతట అదే సరిచేసుకుంటుంది. అయితే కొన్ని రకాల సమస్యలు తీవ్రమైనవి కావడంతో కాలేయ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. పురుషులతో పోలిస్తే మద్యం తాగే అలవాటు స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. కొందరు తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకున్నా కాలేయం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. దీంతో లివర్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ చేయాల్సి రావచ్చు. కాలేయం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు రోగనిరోధక కణాలు కాలేయ కణాలపై పోరాటం చేస్తాయి. దీంతో ఈ అవయవంలో వాపు వస్తుంది. ఈ లక్షణం చాలా మంది స్త్రీలలో కనిపిస్తుంది. లివర్ వాపు కారణంగా మహిళల్లో కొన్ని రకాల వ్యాధులు సోకవచ్చు.

  • హెపటైటిస్ వైరస్‌

లివర్ వాపు కారణంగా మహిళలు హెపటైటిస్ ఎ, బి, సి, డీ, ఈ వైరస్‌ల బారిన పడవచ్చు. నాణ్యతలేని ఆహారం తినడం, రక్షణ లేని సెక్స్, సూదుల ద్వారా ఈ వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకవచ్చు. హెపటైటిస్-ఈ అనేది గర్భిణుల్లో ప్రాణాంతకంగా మారవచ్చు. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయినా, అది వాపునకు దారితీయవచ్చు.

  • సిర్రోసిస్

కాలేయ వ్యాధుల్లో సిర్రోసిస్ ఇది ఒకటి. కాలేయంలోని పిత్త వాహికలు కొంత కాలానికి నాశనం అవుతాయి. ఫలితంగా పిత్తం కాలేయంలో పేరుకుపోతుంది. ఇది సిర్రోసిస్‌ వ్యాధికి కారణమవుతుంది. థైరాయిడ్ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్‌తో కూడా సిర్రోసిస్‌కు సంబంధం ఉంటుంది. దీనికి తోడు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఉంటే కాలేయ మార్పిడి చేయించుకోవాలి.

  • కాలేయ కణితులు

ఈస్ట్రోజెన్ అధిక మోతాదుతో కూడిన ఓరల్ గర్భనిరోధకాలను ఉపయోగించే మహిళల్లో కాలేయ కణితుల వ్యాధి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాలేయ వ్యాధులకు చికిత్స ఆలస్యమైతే పరిస్థితి విషమించవచ్చు. అందుకే సకాలంలో స్క్రీనింగ్ ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవాలి.

  • నివారణ చర్యలు

కాలేయ వ్యాధులతో బాధపడే స్త్రీలు మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. రెగ్యులర్‌గా హెల్తీ డైట్ తీసుకోవాలి, శారీరక శ్రమ చేయాలి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.