Thursday, November 21, 2024
Homeఆరోగ్యంమూడో త‌ర‌గ‌తి చిన్నారికి కార్డియాక్ అరెస్ట్‌

మూడో త‌ర‌గ‌తి చిన్నారికి కార్డియాక్ అరెస్ట్‌

Date:

మూడో తరగతి చదువుతున్న ఒక చిన్నారి, స్కూల్‌లో గేమ్స్ ఆడుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయింది. దీంతో ఈ సమస్య లక్షణాలు, చికిత్స మార్గాల గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. యూపీలోని లక్నోకు చెందిన బాలిక మాన్విసింగ్ (9), నగరంలోని మాంట్ ఫోర్ట్ హైస్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. రోజూ లాగానే ఆమె గత గురువారం బడికి వచ్చింది. అయితే స్పోర్ట్స్ పీరియడ్‌లో తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూ.. ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్కూలు యాజమాన్యం, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లితండ్రులు స్కూల్‌కు వచ్చి మాన్వి సింగ్‌ను స్థానిక చందన్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు, అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. కార్డియాక్‌ అరెస్ట్‌తోనే బాలిక మృతిచెందిందని నిర్ధారించారు.

పిల్లల్లో కార్డియాక్‌ అరెస్ట్‌ కారణాలు

ప్రస్తుత ప్రపంచంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు కూడా కార్డియాక్‌ అరెస్ట్ కారణంగా చనిపోతున్నారు. ఆహారపు అలవాట్లు, చదువుల ఒత్తిడి, వంశపారం పర్యంగా ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు పిల్లల్లో కార్డియాక్‌ అరెస్ట్‌కు కారణమవుతాయి. చిన్నారులు యాక్టివ్‌గా ఉన్నా, నిద్రిస్తున్నా, లేదా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ కార్డియాక్‌ అరెస్ట్ రావొచ్చు. పొరపాటున జబ్బుకు సరిపడని మెడిసిన్ వాడుతున్నప్పుడు, అలర్జీస్‌తో బాధపడేవారు, పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులు, మయోకార్డిటిస్‌, మార్ఫన్ సిండ్రోమ్‌ బాధిత చిన్నారులు కార్డియాక్‌ అరెస్ట్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.