Saturday, December 21, 2024
Homeఆధ్యాత్మికంశివ భ‌క్తుల‌తో నిండిపోయిన శైవాల‌యాలు

శివ భ‌క్తుల‌తో నిండిపోయిన శైవాల‌యాలు

Date:

ఎక్కడ చూసినా శివనామస్మరణే.. దేశ‌వ్యాప్తంగా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని ప్ర‌జ‌లు మ‌హా వేడుక‌గా జ‌రుపుకుంటున్నారు. దేశంలోని అన్ని శైవాల‌యాలు, జ్యోతిర్లింగాలు.. శివ భ‌క్తుల‌తో నిండిపోయాయి. తెల్ల‌వారుజాము నుంచే ప్ర‌ధాన ఆల‌యాల్లో అభిషేకాలు, అర్చ‌న‌లు, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం మోహ‌న్ యాద‌వ్ ఇవాళ ఉజ్జ‌యినిలోని మ‌హాకాలేశ్వ‌ర్ ఆల‌యంలో పూజ‌లు చేశారు. ఆ ఆల‌యంలో శుక్రవారం తెల్ల‌వారుజామున భ‌స్మాహార‌తి నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మ‌హాకాలుడిని స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. గ్వాలియ‌ర్‌లో ఉన్న అచ‌లేశ్వ‌ర్ ఆల‌యంలో కూడా భ‌క్తులు పెద్ద‌గా ఎత్తున ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. ఏపీలోని శ్రీశైలంలో కూడా భారీగా పూజ‌లు నిర్వ‌హించారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

జార్ఖండ్‌లోని దేవ్‌ఘ‌ర్‌లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన బాబా బైద్య‌నాథ్ ఆల‌యంలో కూడా భ‌క్తులు కిట‌కిట‌లాడిపోయారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కేర‌ళ‌లోని కొచ్చిలో ఉన్న అలువ మ‌హాదేవ్ ఆల‌యానికి కూడా భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. శ్రీకాళ‌హ‌స్తిలోని శివాల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఆల‌య ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు.

వార‌ణాసిలోని కాశీ విశ్వ‌నాథుడికి శుక్రవారం ఉద‌యం ప్ర‌త్యేక హార‌తి ఇచ్చారు. కాశీలో వేల సంఖ్య‌లో భ‌క్తులు విశ్వ‌నాథుడి ద‌ర్శ‌నం కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు అయిదు కిలోమీట‌ర్ల మేర అక్క‌డ భ‌క్తులు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగ‌మం వ‌ద్ద భ‌క్తులు ప‌విత్ర స్నానాలు చేశారు. ఢిల్లీలోని గౌరీశంక‌ర్ ఆల‌యానికి భ‌క్తుల తాకిడి పెరిగింది. హ‌రిద్వార్‌లోని ఢాకేశ్వ‌ర్ మ‌హాదేవ్ ఆల‌యం వ‌ద్ద భ‌క్తులు భారీ క్యూలైన్ క‌ట్టారు. మ‌హారాష్ట్ర‌లోని త్ర‌యంబ‌కేశ్వ‌ర్ ఆల‌యాన్ని విద్యుత్తు దీపాల‌తో అలంక‌రించారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా భ‌క్తులు భారీ సంఖ్య‌లో త్రినేత్రుడి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు.