సోషల్ మీడియా పుణ్యమే, మరెదో తెలియదు కాని కొంతమంది వింత మోసాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. అలాంటిది న్యాయమూర్తిలా చలామణి అవుతున్న ఓ మోసగాడిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి నకిలీ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశాడు. దానిలో అతడే న్యాయమూర్తి. సిటీ సివిల్ కోర్టులోని భూవివాదాల పెండింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తులను ట్రాప్ చేశాడు. అనంతరం తాను ఏర్పాటు చేసిన కోర్టుకు వారిని పిలిపించి విచారణ నిర్వహించాడు. కొందరికి అనుకూలంగా తీర్పులిచ్చాడు. ఇందుకుగాను బాధితుల నుంచి కేసు స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేశాడు.
ఇదిలా ఉండగా.. 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో ఒకరికి అనుకూలంగా తీర్పునిస్తూ ఏకంగా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే, ఆ ఉత్తర్వులు నకిలీవని కోర్టు రిజిస్ట్రార్ గుర్తించడంతో శామ్యూల్ బండారం బయటపడింది. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదేళ్లుగా అతడు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా 2015లోనే నిందితుడిపై చీటింగ్ కేసు నమోదైంది. తాజాగా ఈ మోసంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.