Saturday, September 28, 2024
Homeక్రైంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఆత్మహత్యాయత్నం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఆత్మహత్యాయత్నం

Date:

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదురుగా ఒక వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం కర్ణాటక హైకోర్టు హాల్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ నిలయ్ విపిన్‌చంద్ర అంజరియా ఎదుట కత్తితో గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ వ్యక్తిని మైసూర్‌కు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఒకటవ కోర్టు హాలు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఒక ఫైల్‌ అందజేశాడని తెలిపారు. ఏం జరుగుతుందో ఎవరూ ఊహించకముందే చీఫ్‌ జస్టిస్‌ అంజరియా ఎదుట కత్తితో గొంతు కోసుకున్నాడని చెప్పారు. అతడు ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడో అన్నది తెలియలేదని సీనియర్‌ పోలీస్‌ అధికారి అన్నారు. కోలుకున్న తర్వాత అతడిని ప్రశ్నిస్తామని చెప్పారు.

మరోవైపు చీఫ్‌ జస్టిస్‌ అంజరియా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టులోకి ఆ వ్యక్తి కత్తి తీసుకురావడంతో భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన రికార్డులు, ఆధారాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. న్యాయవాది ద్వారా ఫైల్‌ ఇవ్వనందున అందులో ఉన్న పత్రాలను పరిశీలించబోమని న్యాయమూర్తి తెలిపారు. అలాగే కోర్టు ఆదేశం లేకుండా ఏ అధికారి కూడా ఆ ఫైల్‌ను స్వీకరించవద్దని అన్నారు.