Wednesday, October 30, 2024
Homeక్రైంహైకోర్టును ఆశ్ర‌యించిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

హైకోర్టును ఆశ్ర‌యించిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

Date:

హైద‌రాబాద్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. తనపై అరెస్టు చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల నోటీసుల నేపథ్యంలో, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి, తాను నిర్దోషిగా ఉన్నానని, పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు పోలీసుల ఎదుట హాజరు కావడానికి రెండు రోజుల గడువు ఇచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని అతిక్రమించవద్దని సూచించింది. రాజ్ పాకాల తరఫున మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇంట్లో జరిగే పార్టీకి పోలీసులు అక్రమంగా దాడి చేశారని, సంస్థ ఉద్యోగికి డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినా రాజ్ పాకాలపై దోషారోపణలు చేశారని కోర్టుకు తెలిపారు.

పోలీసుల తరఫున అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, రాజ్ పాకాలకు 41ఏ నోటీసులు ఇవ్వడం మాత్రమే జరిగిందని కోర్టుకు వివరించారు. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వల్లే ఈ విచారణ జరుగుతోందని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని అన్నారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు, పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల గడువు ఇచ్చింది.