ఇంటికి వెళ్లేందుకు పాఠశాల సెలవు కోసం ఒక విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటవ తరగతి బాలుడిని చెరువులో ముంచి హత్య చేశాడు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న ప్రైవేట్ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంతటా వెతికారు. రెండు రోజుల తర్వాత స్కూల్ సమీపంలోని చెరువులో పసి బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి తలపై కొట్టిన గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిసింది.
బాలుడి మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బాలుడి మిస్సింగ్ నుంచి స్కూలుకు రాని ఎనిమిదవ తరగతి విద్యార్థిపై అనుమానించారు. ఆ స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారం కిందటే హాస్టల్‌లో చేరిన ఆ విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు సెలవు కోసం ఒకటవ తరగతి బాలుడిని చంపినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. 8వ తరగతి స్టూడెంట్ ఆ బాలుడిని చెరువు వద్దకు తీసుకెళ్లి తలపై కొట్టి నీటిలో పడేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.