Sunday, September 29, 2024
Homeక్రైంసుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో సత్వర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను 29న విచారణ జరుపనున్నది. సుప్రీంకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది. ఈ నెల 19న విచారణకు జాబితా చేయాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ 29న విచారణకు జాబితా చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనుంది. మద్యం పాలసీ కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో తిహార్‌ జైలులో ఉన్నారు.