Monday, December 23, 2024
Homeక్రైంశివరాత్రి వేడుకల్లో పిల్లలపై కరెంటు వైర్లు

శివరాత్రి వేడుకల్లో పిల్లలపై కరెంటు వైర్లు

Date:

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు సాగుతున్న సమయంలో రాజస్తాన్ కోటాలో అపశృతి చోటు చేసుకుంది. శివరాత్రి పూజల్లో పాల్గొంటున్న పిల్లలపై కరెంటు వైర్లు పడటంతో ఏకంగా 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కోటాలో ఉన్న కాలీ బస్తీ ప్రాంతంలో ఉదయం 11 గంటలకు శివరాత్రి సందర్భంగా భారీ ఊరేగింపు జరుగుతోంది. ఈ సమయంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఈ ఊరేగింపు కోసం ఎక్కువగా తరలివచ్చారు. ఓ గుడి నుంచి కలశం తెచ్చేందుకు మరో గుడి వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఊరేగింపులో పాల్గొంటున్న చిన్నారులు ఓ పొడవైన ఐరన్ రాడ్ కు జెండాలు తగిలించి తీసుకెళ్తున్నారు. ఈ రాడ్ కాస్తా హైటెన్షన్ వైర్ కు తాకడంతో వీరంతా విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే కోటలోని ఎంబీఎస్‌ ఆస్పత్రిలో గాయపడ్డ చిన్నారుల్ని చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ షాక్ గురైన చిన్నారులు అంతా 9 నుంచి 16 ఏళ్లలోపు వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కలెక్టర్ రవీంద్ర గోస్వామితో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్ కూడా క్షతగాత్రులను పరామర్శించారు. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం జైపూర్ కు తరలించే అవకాశముంది.