ఉత్తరప్రదేశ్‌లో తాజాగా 12వ తరగతి బోర్డుకు సంబంధించిన గణితం, బయాలజీ ప్రశ్నపత్రాలు పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు వచ్చిన వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘మరోసారి పేపర్ లీకైంది.. ఎందుకని? బీజేపీ పాలనలో ఉద్యోగ పరీక్షల నుంచి బోర్డు పరీక్షల వరకు దాదాపు ప్రతీ పేపరూ లీక్ అవుతోంది” అని ‘ఎక్స్’ వేదికగా ప్రియాంక దుయ్యబట్టారు. పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకొనేక్రమంలో ఎదుర్కొనే మొదటి ఛాలెంజ్ ఈ బోర్డు పరీక్షలేనన్న ప్రియాంక.. ఇక్కడే వారికి ఇంత ద్రోహం జరిగితే ఇక వాళ్లేం చేస్తారు? అని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న పరీక్షల మాఫియా, ప్రభుత్వంలో ఉన్న కొందరు అవినీతిపరుల్ని భాజపా కాపాడుతోందని దుయ్యబట్టారు. పిల్లలు మంచి చదువులు చదవడం ద్వారా వారి భవిష్యత్తు బాగుపడటం భాజపాకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
ఇదిలాఉండగా.. పేపర్ లీకేజీ ఘటనపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫతేపూర్ సిక్రీలో కేసు నమోదైంది. ఈ ఘటనపై ఫతేపూర్ సిక్రీ రాజహౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అదే సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడితో పాటు పలువురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ అనే వాట్సప్ గ్రూపులో ఈ ప్రశ్నపత్రాలను ప్రిన్సిపాల్ కుమారుడే పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.