ఉత్తరప్రదేశ్ రాయబరేలీలోని రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ దిమ్మెలను గూడ్స్ రైలు ఢీకొట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాయబరేలీలోని లక్ష్మణ్‌పూర్‌లో గూడ్స్ రైలు పట్టాలపై ఉన్న సిమెంటు దిమ్మెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలిపారు. ఈ దిమ్మెలను సమీప పొలం నుంచి దుండగులు తీసుకొచ్చి పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఆర్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లకు ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల యూపీలోని లలిత్‌పూర్‌లో రైల్వేట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన నిందితుడిని గత వారం పోలీసులు అరెస్టు చేశారు. ఇక, కాన్పూర్‌లోని రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. రైల్వే ట్రాక్‌పై ఉంచిన పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. గుజరాత్‌లోని బొటాడ్‌లో పట్టాలపై ఇనుప ముక్కను ఉంచిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు.