హైదరాబాద్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు నిందితుడు ఆలయ గేట్‌ను కాలితో తన్ని లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తయ్యాయి. ఘటన అనంతరం నిందితుడిని స్థానికులు చితకబాదారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలయం వద్దకు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకర్ని అరెస్టు చేశారు.