దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడుల్లో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మనుషుల ప్రాణాల కంటే కుక్కలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. కుక్కల కంటే మానవుల ప్రాణాలు విలువైనవని పేర్కొంది. ఇక వీధి కుక్కల రక్షణ గురించి మాట్లాడే జంతు ప్రేమికులు.. టీవీలు, పేపర్లలో ప్రకటనలు చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థలకు సహకారం అందించాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎవరైనా వీధి కుక్కలను పెంచుకునే వారు ఉంటే వారికి లైసెన్స్‌లు ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు తెలిపింది. వీధి కుక్కలను సంరక్షిస్తున్న కన్నూర్ జిల్లాలోని ముజతడం ప్రాంతానికి చెందిన రాజీవ్ కృష్ణన్ వల్ల తమకు ఇబ్బందిగా ఉందని.. స్థానికంగా ఉండే ఇద్దరు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడులను తీవ్రంగా పరిగణించింది. ఒంటరిగా స్కూలుకు వెళ్లాలంటనే కొందరు విద్యార్థులు వీధి కుక్కలను చూసి భయపడుతున్నారని పేర్కొంది. వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని తెలిపిన హైకోర్టు.. జంతు ప్రేమికులు కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది. వీధి కుక్కలపై ఏవైనా చర్యలు తీసుకుంటే జంతు ప్రేమికులు ఆందోళనలు చేస్తారని కూడా హైకోర్టు వెల్లడించింది.
వీధి కుక్కలకు సంబంధించి అవసరమైతే మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ సూచించారు. వీధి కుక్కలను కాపాడేందుకు జంతు ప్రేమికులు న్యూస్ పేపర్లు, టీవీ ఛానెళ్లలో కాకుండా ప్రభుత్వ సంస్థలకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. ఇక గాయపడిన, ఒంటరిగా ఉన్న వీధి కుక్కలను తీసుకువచ్చి రాజీవ్ కృష్ణన్ పెంచుకోవడం వల్ల తమకు ఇబ్బందిగా మారిందని ఇద్దరు వ్యక్తులు వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. జంతువులను సంరక్షించేందుకు లైసెన్స్ కోసం కన్నూర్ కార్పొరేషన్‌లో నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది.