Thursday, September 19, 2024
Homeక్రైంభర్త తల్లితో గడపడం గృహ హింస కాదు

భర్త తల్లితో గడపడం గృహ హింస కాదు

Date:

ఒక కొడుకు తన తల్లితో మాట్లాడటం, ఆవిడతో గడపటం, తల్లికి డబ్బు ఇవ్వడం గృహ హింస ఎలా అవుతుందని సెషన్స్‌ కోర్టు పేర్కొంది. దిగువ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ భర్తపై, భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ తన భర్త, అత్తింటి వారిపై గృహ హింస కింద కోర్టును ఆశ్రయించింది. తల్లి మానసిక రోగాన్ని దాచి తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తాను ఉద్యోగం చేయడాన్ని అత్త వ్యతిరేకించిందని, భర్త, ఆమె తల్లి కలిసి తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది.

తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబరు 2004 వరకు ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, సెలవుపై భారత్‌కు వచ్చినప్పుడు తల్లిని కలిసేవాడని, ఆమెకు ప్రతి ఏటా రూ.10,000 పంపేవాడని ఆ మహిళ ఆరోపించింది. తల్లి కంటి ఆపరేషన్ కోసం కూడా డబ్బు ఖర్చు చేశాడని పేర్కొంది. అత్త ఇంటి కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద రక్షణ, ఉపశమనం, కల్పించడంతోపాటు పరిహారం ఇప్పించాలని మేజిస్ట్రేట్ కోర్టును కోరింది. భార్య తనను భర్తగా ఎన్నడూ అంగీకరించలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసేదని ఆ వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఆమె క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నాడు. అలాగే తనకు చెప్పకుండా తన ఎన్‌ఆర్‌ఈ ఖాతా నుంచి రూ. 21.68 లక్షలు విత్‌డ్రా చేసిందని, ఆ డబ్బుతో ఫ్లాట్‌ కొనుగోలు చేసిందని ఆమె భర్త ఆరోపించాడు.

మరోవైపు ఆ మహిళ అభ్యర్థనపై విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత గృహ హింస కింద ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే మధ్యంతర భరణాన్ని రద్దు చేసింది. దీంతో ఆ మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరిపిన ఆ కోర్టు ఒక వ్యక్తి తన తల్లికి సమయం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబోమని పేర్కొంది. తగిన ఆధారాలు లేవంటూ ఆ మహిళ పిటిషన్‌ను తిరస్కరించింది.