భర్తకు తన కంపెనీలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య అనుమానించింది. ఆ మహిళను కలిసింది. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి చంపింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో మహిళ ఈ సంఘటనలో గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బ్రజేష్ మిశ్రాకు చెందిన నిర్మాణ కంపెనీలో 33 ఏళ్ల అనికా మిశ్రా ఉద్యోగిగా పని చేస్తున్నది. అయితే ఆ మహిళ, బ్రజేష్ మధ్య వివాహేతర సంబంధం ఉందని అతడి భార్య అయిన 35 ఏళ్ల శిఖా మిశ్రా అనుమానించింది.
బుధవారం అనికాను శిఖా సంప్రదించింది. ప్రొఫెసర్ కాలనీలోని సోనమ్ నివాసంలో ఆమెను కలిసింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారితీయడంతో అనికాపై కత్తితో శిఖా దాడి చేసి పొడిచింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సోనమ్ కూడా ఈ సంఘటనలో గాయపడింది. హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతున్నది. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనికాపై కత్తితో దాడి తర్వాత అక్కడి నుంచి పారిపోయిన నిందితురాలు శిఖా మిశ్రాను గురువారం సాత్నా రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.