ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాబువా జిల్లాలోని ఫుల్దాన్‌వాడికి చెందిన 29 ఏళ్ల నర్వే సింగ్, 28 ఏళ్ల కాంతి స్నేహితులు. మంగళవారం సాయంత్రం వీరిద్దరూ కలిసి బైక్‌పై ఉజ్జయినీ నుంచి సొంతూరుకు తిరిగి వస్తున్నారు. ఇండోర్-అహ్మదాబాద్ హైవేపై నల్‌ఖేడా వద్ద వేగంగా వచ్చిన మరో బైక్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్వే సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు.
బైక్ ప్రమాదంలో గాయపడిన కాంతి, తన కళ్లేదుటే స్నేహితుడు నర్వే సింగ్ మరణించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఫ్రెండ్‌ను కోల్పోయిన బాధతో తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వీడియోలో రికార్డ్ చేశాడు. తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించవద్దని అందులో కోరాడు. ఈ వీడియోను తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢీకొట్టిన మరో బైక్ వ్యక్తులు గాయపడటంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నర్వే సింగ్, ఆ పక్కనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కాంతి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.