మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థానిక పండుగ వేడుకలో నిర్వాహకులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. అక్కడే ఉన్న సమర్ బిల్లోర్ అనే బాలుడి(13)కి కూడా ఊపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వారి మధ్యలోకి దూరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డీజే సౌండ్‌కి బాలుడి గుండె తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా మిగతా వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. బాలుడి తల్లి గమనించి.. సౌండ్ ఆపమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతోనే తన కొడుకు ప్రాణాలు పోయాయని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మృతికి డీజేనే కారణమని ఆరోపించాడు.
హైదరాబాద్‌లో డీజే సౌండ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నగరంలో డీజే సౌండ్‌ను పోలీసులు నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్ .. డీజేను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.