Thursday, October 3, 2024
Homeక్రైంప్రజ్వల్ రేవణ్ణ విచారణలో మహిళా అధికారులు

ప్రజ్వల్ రేవణ్ణ విచారణలో మహిళా అధికారులు

Date:

హసన్‌ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో మహిళా పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. అయితే, ప్రజ్వల్‌ను మహిళా అధికారులతోనే ఎందుకు అరెస్ట్ చేయించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వర్గాలు స్పందిస్తూ.. ‘ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయడానికి మహిళా పోలీస్ అధికారులను పంపాలని ఆదేశం ఉంది.. ఎంపీ తన హోదా, అధికారాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసే అధికారం మహిళా పోలీసులకు ఉంది.. ఈ చర్యతో మహిళా అధికారులు ఎవరికీ భయపడరని బాధితులకు బలమైన సందేశం పంపుతుంది’ అని పేర్కొన్నారు.

ప్రజ్వల్ రేవణ్ణ కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం14 మంది మహిళా అధికారులతో సహా 29 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటుచేసింది. వీరిలో సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ఐపీఎస్లు సుమన్ డీ పెన్నేకర్, సీమా లత్కర్ నేతృత్వంలో ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసి.. కారులో మహిళా అధికారులు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రజ్వల్‌ విచారణలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సిట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘వివిధ కారణాలతో మహిళా అధికారుల పేర్లను వెల్లడించడం మాకు ఇష్టం లేదు.. మేం ఒక టీమ్‌గా పని చేస్తున్నాం.. ప్రజ్వల్ రేవణ్ణ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి.. కాబట్టి అది మహిళా అధికారుల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి’ అని సిట్ వర్గాలు తెలిపాయి. ఇతర నిందితులతో వ్యవహరించినట్టుగానే ప్రజ్వల్ రేవణ్ణను కూడా మహిళా అధికారులు విచారిస్తున్నారు. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (33) బదులివ్వకుండా సతాయిస్తున్నాడని తెలుస్తోంది. తాను ఏ నేరం చేయలేదని, ఇది రాజకీయ కుట్ర అంటూ పదే పదే చెబుతున్నట్టు సమాచారం.