కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నగరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.21కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 606 డ్రగ్స్ పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని అమెరికా, బెల్జియం, యూకె, థాయ్‌లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో హైడ్రో గంజాయి, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ క్రిస్టల్స్ తదితర మత్తు పదార్ధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని బెంగళూరులో అధిక ధరలకు విక్రయించేందుకు నిందితులు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.