Monday, October 7, 2024
Homeక్రైంపిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి ఉరి డ్రామా..

పిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి ఉరి డ్రామా..

Date:

పిల్ల‌లు అల్ల‌రి చేస్తుంటారు.. వారి అల్ల‌రి త‌గ్గించేందుకు త‌ల్లిదండ్రులు వివిధ ఉపాయాలు ప‌న్నుతుంటారు. అలాంటిది ఒక తండ్రి త‌న పిల్ల‌ల అల్ల‌రి మాన్పించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం చివ‌రికి అత‌ని ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఏపీలోని వైజాగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన చందన్‌ కుమార్‌ (33) ఇండియన్‌ రైల్వేస్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్లుగా వైజాగ్‌లోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. చందన్‌కు ఒక కూతురు (7), కొడుకు (5) ఉన్నారు. ఇటీవల వీళ్ల అల్లరి ఎక్కువయ్యింది. వాళ్లను ఏమైనా గట్టిగా ఒక మాట అంటే.. భార్య కూడా పిల్లలకే వత్తాసు పలుకుతుంది. తాజాగా బుధవారం రాత్రి కూడా ఇలాగే జరిగింది. చందన్‌ జేబులో నుంచి కరెన్సీ నోట్లను తీసుకున్న ఇద్దరు పిల్లలు వాటిని చించేశారు. అది చూసిన చందన్‌ వారిని మందలించాడు. కోప్పడుతున్న చందన్‌ను చూసి భార్య అడ్డుపడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ తర్వాత తనకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని.. ఇలాగే చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్‌ బెదిరించాడు. కానీ చందన్‌ మాటలను భార్యాపిల్లలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్‌ హుక్‌కు చీరకట్టి దాన్ని మెడకు చుట్టుకుని వాళ్లను భయపెట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుపోయింది. తమను బెదిరించేందుకు చందన్‌ అలా చేస్తున్నాడని అతని భార్య అనుకుని చాలాసేపటి దాకా పట్టించుకోలేదు. అయితే ఎంతసేపటికీ ఉలుకుపలుకు లేకుండా అలాగే ఉండిపోయేసరికి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసి చీరను విప్పేసింది. కానీ అప్పటికే ఉరిపడటంతో తీవ్ర అస్వస్థతకు గురై చందన్‌ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చందన్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.